Mangalagiri Sri Lakshmi Nrusimha Swamy Mukkoti Ekadasi

Sri Lakshmi Nrusimha Swamy Temple, Mangalagiri.. photo, 1910

శ్రీ చెంచు లక్ష్మి సమేత శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం, కేతవరం 




దిగువ సన్నిధిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మి నృసింహ స్వామి వారు

                  కృష్ణా పరీవాహక ప్రాంతంలో నెలకొన్న నరసింహ క్షేత్రాలు ఐదు. ఇవే పంచ నరసింహ క్షేత్రాలు. ఈ ఆలయాలన్నీ కొండపైనే లేదా గుహలలో నెలకొని ఉంటాయి.  వేదాద్రి, మట్టపల్లి, వాడపల్లి, మంగళగిరి, కేతవరం. వీటిలో  కేతవరాన్ని  'కాటారం', 'కేతారం' అని పిలుస్తారు.  కేతవరం గ్రామం గుంటూరు జిల్లా, బెల్లంకొండ మండలంలో వుంది. ఇక్కడ కృష్ణా నది లోతు ఎక్కువ. ఆలయంలో స్వయంభువుగా శ్రీ నరసింహస్వామి కొలువై వున్నారు. అమ్మవారు చెంచులక్ష్మి.
ఎగువ నృసింహ స్వామి వారి ఆలయం
ఎగువ ఆలయానికి చేరుకోవడానికి మెట్ల దారి 
             ఈ గ్రామంలో మూడు నరసింహ స్వామి ఆలయాలు కలవు. కొండ పైన ఒకటి,  దిగువున రెండు నెలకొని ఉంటాయి. ఇవి గ్రామానికి కొంచెం దూరంగా ఉండటం వలన గ్రామంలో నది ఒడ్డునే మరొక నరసింహ స్వామి ఆలయం నిర్మించబడి వుంది. ఈ క్షేత్రం సుమారు మూడు వేల సంవత్సరాల చరిత్ర కలిగి వుంది.
దిగువ సన్నిధి ఆలయం
స్థల ప్రాశస్త్యం :
                ఈ ఆలయాన్ని కోట (కేత) రాజులు  నిర్మింప చేసారు. క్రీ.శ.11 వ శతాబ్దంలో  కోట కేత రాజుల పాలనలో వున్న ఈ ప్రాంతానికి ఒక యాదవ రాజు సామంతుడుగా ఉండేవాడు. అతను ఈ ప్రాంతంలో నిద్రిస్తుండగా స్వామి వారు కలలో సాక్షాత్కరించి తన ఉనికిని తెలుపగా... ఆ యాదవ రాజు కోట కేతవరాజైన కేతవర్మకు ఈ విషయం తెలిపాడు. కేతవర్మ స్వయంగా విచ్చేసి వెదికించగా కొండమీద రాతి పై శ్రీ స్వామి, అమ్మవార్ల రూపం కనిపించగా అక్కడే రాతి స్తంభాలతో ఆలయాన్ని నిర్మింపచేసి, ధూప దీప నైవేధ్యాల కోసం భూములను ఇచ్చినట్లుగా అక్కడ వున్న శాసనముల ద్వారా తెలుస్తున్నది. కొండ పైకి 600 మెట్లు ఉండడం, మండప నిర్మాణాలకు అవకాశం లేనందున  శ్రీ స్వామివారికి ఉత్సవాలు, జాతరలు జరపడం కష్టంగా మారడంతో దిగువన మరొక ఆలయాన్ని నిర్మింప చేశారు.  కొండ మీద ముందుగా శ్రీ స్వామీ వారి ఆలయం, దీనికి పైన అమ్మవారి ఆలయాన్ని మనం దర్శించవచ్చు. 

వజ్రాలయ్య
            శ్రీ స్వామీ వారి ఆలయం నిర్మించిన తరువాత నీటి వసతి కోసం కోనేరు త్రవ్వుచుండగా పనివానికి రాయి గ్రుచ్చుకుని రక్తం కారుచుండగా ఆ గాయాన్ని నీళ్లతో శుభ్రపర్చగా రాయి మెరుస్తూ ఉండడంతో పరిశీలించగా వజ్రం అని నిర్ధారించుకొని... ఇక్కడ మరిన్ని దొరకవచ్చునని మరికొంత లోతుకు వెదకగా శ్రీ స్వామివారి ఉత్సవ మూర్తులు బయల్పడినవి.  వజ్రాలతో బయల్పడిన స్వామి వారిని "వజ్రాలయ్య"గా భక్తులు పిలుచుకుంటారు.

రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు స్వామి వారిని దర్శించుట
నది ఒడ్డునే వున్న మరొకఆలయాన్ని శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు కట్టించినట్టుకేతవరం గ్రామాన్ని శ్రీ
స్వామి వారికి 1792 లో  దానం చేసినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తున్నది.  వేంకటాద్రి నాయుడు గారి యేలుబడిలో
వున్న  గ్రామంనందు స్థానిక చెంచు తెగ నాయకుడు అతని మద్దతుదారులతో కలిసి దారి దోపిడీలు చేస్తూ
ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నాడు.రాజా వేంకటాద్రి నాయుడు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఆజ్ఞను
ధిక్కరించడంతో... రాజా వేంకటాద్రి నాయుడు అతనిని నమ్మకంగా విందుకు ఆహ్వానించి అతని చేతులు నరికిస్తాడు.
కృష్ణ నది ఒడ్డునే నిర్మితమైన ఆలయంలోని శ్రీ చెంచులక్ష్మి సమేత నరసింహ స్వామి వారు    

             అతిధిని  తన ఇంటికి విందుకు ఆహ్వానించి చేతులు నరకడం మిక్కిలి పాపమని కలత చెందిన రాజా వారు తన
పాపానికి పరిహారం చూపమని ఆస్థాన పండితులను అడుగగా వారు హిందూ దేశంలోని అన్ని పవిత్ర నదులలో
స్నానమాచరిస్తే ఫలితం ఉంటుందని చెప్పడంతో వేంకటాద్రి నాయుడు దేశాటన చేస్తూ ఉండగా ఒక రోజు శ్రీ నరసింహ
స్వామి వారు కలలో కనిపించి "ఎక్కడైతే కృష్ణానది ఉత్తర దిక్కుగా ప్రవహిస్తుందో అక్కడ నాకొక ఆలయాన్ని నిర్మించ
మని చెప్పడం"తో రాజా వారు కృష్ణ నది ఒడ్డున ప్రయాణం చేస్తూ కేతవరం దగ్గర కృష్ణా ఉత్తర దిక్కుగా ప్రవహిస్తుండ
డంతో, నదిలో స్నానమాచరించి కొండ ఎగువ, దిగువ సన్నిధిలలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించి, 
నది ఒడ్డునే మరొక గుడిని కట్టించి తన పాపాన్ని పోగొట్టుకున్నాడని కధనం.   ఈ గుడి నిర్మాణాన్ని 1992లో
పునర్నిర్మాణం చేయడం జరిగింది.
ముఖద్వారం



ముఖద్వారం












ఉత్సవాలు
              శ్రీ చెంచులక్ష్మి సమేత  నరసింహ స్వామి వారి కళ్యాణం ప్రతి సంవత్సరము చైత్ర శుద్ధ చతుర్దశి నాడు కళ్యాణం దిగువ ఆలయంలో జరుగుతుంది.  చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున రధోత్సవం జరుగుతుంది. ఇక్కడి రథోత్సవానికి సంబంధించి ఒక కథ ప్రచారంలో వుంది. ఇక్కడి స్వామివారికి పూర్తిగా కంచుతో చేసిన రధం ఉండేదని...  ఒక నాడు రథోత్సవం రోజున ఉత్సవ మూర్తులనుంచి కంచు రధంపై ఊరేగిస్తుండగా రధం భక్తుల చేతుల్లో నుంచి పట్టు సడలి నదిలో కలిసి పోయిందనేది ఇక్కడి భక్తుల కథనం. ఇప్పటి వరకు ఆ రధం ఉత్సవ విగ్రహాలతో సహా నదిలోనే ఉండిపోయింది అని అంటారు.  అనంతరం స్వామి వారి భక్తుడు శ్రీ పింగళ రామిరెడ్డి శ్రీ స్వామివారికి మరొక రధాన్ని చేయించడంతో అప్పటి నుంచి ఈ రోజు వరకు అదే రథంతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

గర్భాలయం

ధ్వజస్తంభం

           ప్రస్తుతం  ప్రాంతం పులిచింతల  ముంపు ప్రాంతం కావడంతో  దిగువ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సమీపంలోని కొండ మీదకు తరలించారు.







          గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి ఆటోలు ఉంటాయిఇది జన సంచారం అంతగా లేని ప్రాంతం కావడంతో గుంపుగా వెళ్లడం మంచిది.
గుడి నుండి నదిలోకి మెట్ల దారి 
కృష్ణానది 






Vazralaiah, Kethavaram, Guntur District

శ్రీశైలం దక్షిణ ద్వారం... కడప జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతం...లంకమల అభయారణ్యంలో ఎత్తయిన గుహలో సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం.... నిత్యం దేవతలు అర్చించే స్వామి... శ్రీ నిత్యపూజ స్వామి...
భూఉపరితలానికి 3కి॥మీ॥ ఎత్తులో... ప్రకృతి రమణీయతతో... ఎత్తైన కొండపై నుండి దూకే జలపాతం... కోనేరు... రెండు కొండల మధ్య పారే సన్నని సెలయేరు, ఎత్తైన భారీ వృక్షాలు... అప్పుడప్పుడు తొంగిచూసే సూర్యుని కిరణాలు... మనస్సుకు ప్రశాంతతను కలుగజేస్తాయి... అడుగు ఎత్తున్న రాళ్ళ మధ్య ప్రయాణం... ప్రమాదవశాత్తూ కొండపై నుండి రాళ్ళు పడుతున్నప్పుడు శివనామస్మరణతో ఆ రాళ్ళు పక్కకు వైదోలగునని భక్తుల నమ్మకం. ప్రతి సోమవారం ఆర్టీసి సిద్ధవటం నుండి బస్సు నడుపుతుంది. మిగతా రోజులలో ప్రైవేటు వాహనాలలోనే వెళ్ళాలి.
ఋషి అవతారము దాల్చి సాక్షాత్తూ శివపరమాత్ముడే కొండపైన పేటు క్రింద సొరంగమార్గంలోని ఓ గుహలో తపస్సునాచరిస్తూ ఊద్భవలింగంగా మారినట్లు చెబుతారు. శ్రీస్వామి వారిని దేవతలు, ఋషులు ప్రతి నిత్యం పూజించడము వలన నిత్యపూజస్వామిగా ప్రసిద్ధి చెందినట్లు, కొండదిగువున ఉన్న అక్కదేవతలు ఊద్భవలింగాకారంలో వున్న పరమశివుని పూజించేవారని అంటారు. ఈ స్వామికి అభిషేకము చేసి, పూజలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని, సంతానము నొసగే స్వామిగా.. శరణు కోరిన వారికి వెన్నంటి నిలుస్తాడని... తప్పు చేసిన వారికి ఇబ్బందులు తప్పవని భక్తుల నమ్మకం.
భక్తులందరు జలపాతంలో స్నానమాచరించి మెట్ల దారి గుండా నిత్యపూజయ్య స్వామి దర్శనానికి బయుదేరతారు... మెట్ల చివరకు ఒక పక్క లోయ... మరో పక్క పెద్ద బండరాళ్ళ క్రింద మనకు నిత్యపూజలన్దుకునే స్వామి కనిపిస్తారు.. దర్శించుకుని కొంచెం ముందుకు వెళ్ళిన తరువాత మనకు గుహలో ఉద్భవించిన లింగం కనిపిస్తుంది... ఈ గుహలో ప్రవేశం చాలా కష్టదాయకం...
సిద్ధవటం మండం మూలపల్లె గ్రామమునకు చెందిన అయ్యవారయ్య పశువులను మేపుకొంటూ ఉండేవాడు.. పశువుల మందలోని ఒక ఆవు ఉదయం, సాయంత్రం పాలు ఇవ్వకపోవడంతో అయ్యవారయ్య ఆ ఆవును పరిశీలించగా... ఆ ఆవు కొండ సొరంగ మార్గంలోని పేటు క్రింద తపస్సు చేస్తున్న శివపరమాత్ముడి దగ్గరకు వెళ్ళి పాలు ఇవ్వటం గమనించి అయ్యవారయ్య శ్రీ స్వామివారి సేవలోనే ఆరు నెలల కాలం గడుపుతాడు... స్వామి వారి కోరిక మేరకు అయ్యవారయ్య స్వగ్రామమైన మూలపల్లెకు చేరి స్వామి వారి గురించి గ్రామంలో అందరికి వివరించగా... శ్రీ స్వామి వారి ప్రసిద్ధి అందరికి తెలిసినది. అయ్యవారయ్య పెన్నానది ఒడ్డున వున్న తన స్వగ్రామమైన మూలపల్లెలోనే సజీవ సమాధి నొందాడు. నిత్యపూజయ్య స్వామిని దర్శించుకొన్న భక్తులు మూలపల్లెలోని అయ్యవారురెడ్డిని కూడా దర్శించుకుంటారు.
అక్కదేవతల కోన. నిత్య పూజయ్య స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కదేవతల కోన వెళ్ళటానికి ఒక దారి కూడా ఉన్నది. అక్కదేవతల కోన దట్టమైన అడవి మధ్యలో ఉండే ఈ అక్కదేవతల కోన చుట్టూ పచ్చని చెట్లు, కొండలు ఉంటాయి. ఈ ప్రదేశంలోని ఒక చిన్న గుడిలో అక్కదేవత లు కొలువై ఉంటారు. వీరు నిత్యం స్వామిని కొలుస్తుంటారని ప్రతీతి.
కొండపైన శ్రీ స్వామి వారి గుడికి దగ్గరగా దాతలు తమ స్వంత ఖర్చుతో ప్రతిరోజు నిర్వహించు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఎక్కువగా శ్రీ స్వామి వారిని సోమవారం రోజు మాత్రమే భక్తులు కులమతాలకతీతంగా దర్శించుకుంటారు... కొండపైకి గాని.. అడవిలో గాని ఎటువంటి విద్యుత్‌ సౌకర్యము లేదు.. మహాశివరాత్రి రోజు మాత్రము జనరేటర్లను భుజాలపై మోసుకుపోయి ఆ వారం రోజులు విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మహాశివరాత్రి రోజు శ్రీస్వామి వారి దర్శనానికి ఐదు గంటకు పైగా క్యూలో వేచి వుండాల్సి వస్తుందంటే ఎంతమంది భక్తులు వస్తారో మనం అంచనా వేసుకోవచ్చు. వానాకాలం అయితే నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్లాల్సివస్తుంది.
రూట్ మ్యాప్
కడప నుండి సిద్దవటం 33 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అక్కడి నుండి 16 కిలోమీటర్స్ దూరం దట్టమైన అడవి మార్గాన వెళితే నిత్య పూజ కోన క్షేత్రానికి చేరుకోవచ్చు. కొండ కింద ఉన్న పంచలింగాలకోన వరకు బస్సులు, షేర్ ఆటోలు తిరుగుతుంటాయి. పంచలింగాల నుండి ప్రధాన గుడి వరకు కాలినడకన వెళ్ళాలి. పెద్ద పెద్ద బండరాళ్ల మధ్యన సాగే నడక మార్గం చాలా ఆహ్లాదకరంగా ఉండి, ట్రెక్కింగ్ ను తలపిస్తుంది.
శ్రీ నిత్యపూజ స్వామి

Nityapoojala Kona

కొండపాటూరు ‘పోలేరమ్మ’ అమ్మవారు
కొండపాటూరు... గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోని చిన్న గ్రామం. కానీ... అక్కడ స్వయంభువుగా వెలసిన శ్రీ పోలేరమ్మ అమ్మవారు చాలా...చాలా... శక్తివంతమైన....మహిమాన్వితమైన... సత్యంగల... గ్రామదేవత... కొండపాటూరు పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ళను (లేదా) అమ్మవారికి భక్తులు సమర్పించే బోనాలు ‘కొండపాటూరు జాతర’గా ప్రసిద్ధి. పూర్వం అమ్మవారు గ్రామంలోని ప్రజలకు రాబోయే అరిష్టాలను గురించి ముందే హెచ్చరిస్తుందని అంటుంటారు. అమ్మవారు పెద్దగా వేసే అరుపులకు జనం భయపడి పూజలు చేసి అమ్మవారిని శాంతింపచేశారని చెబుతుంటారు.గుంటూరు నుండి చిలకలూరిపేట వెళ్ళే రోడ్డు (ఎన్‌హెచ్‌`5) వైపు పర్చూరు రోడ్డు వైపు ప్రత్తిపాడు, పెదనందిపాడు మీదుగా వెళ్ళవలెను. గుంటూరు నుండి కొండపాటూరు సుమారు 45 కి.మీ. వుంటుంది.
ఇక్కడ వున్న అమ్మవారికి ఆడవారే కాకుండా మగవాళ్ళు కూడా పొంగళ్ళు (బోనాలు) సమర్పిస్తుంటారు. అలాగే ఇక్కడ జంతుబలులు కూడా జరుగుతుంటాయి. దేవస్థానం వారు ‘జంతుబలులు నిషేధం’ అని బోర్డులు పెట్టినా ఉపయోగం లేదు.
చుట్టు ప్రక్కల రైతులు తమ పాడిపంటలు పచ్చగా వుండాలని అమ్మవారిని కోరుతుంటారు. ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల మీద కుటుంబాలుగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా రైతులు తమ ట్రాక్టర్లను, ఎడ్లబండ్లను మల్లెపూలతో అలంకరించడం చూస్తే ముచ్చటేస్తుంది.
భక్తులు వారి వారి స్తోమతను బట్టి ప్రభలను గొప్ప ఊరేగింపుతో భజాభజంత్రీలతో, తప్పెట్లతో తమ తమ బండ్లపై కట్టుకొని అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు.
ఇక్కడ వున్న మరొక ముఖ్యమైన విషయం. ‘‘సిడిమాను’’. జాతర రోజు ఈ సిడిమానుకు కట్టబడిన బోనులో మేకపిల్లను వుంచి గుడిచుట్టూ ప్రదక్షిణ చేస్తారు. భక్తులు జీడిమామిడి కాయలను ఈ మేకపిల్ల వున్న బోనుపైకి విసరివేస్తారు. అవి తిరిగి మనకు అందితే మన మనస్సులో వున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ సిడిమానుకు రైతులు తమ తమ పొలాల్లో పండిన పంటలతో అలంకరిస్తారు. ఈ తిరునాళ్ళకు భక్తులు చాలా పెద్ద సంఖ్యలో విచ్ఛేస్తారు. ఇటు వైపు వచ్చినప్పుడు అమ్మవారిని తప్పక దర్శించండి... 


Kondapaturu



సకలపాపహరణం 'శిలా వల్మీక రూప  శ్రీ వెంకటేశ్వర స్వామి' దర్శనం

 

 

 తిరుమలగిరి

         కలియుగ ప్రత్యక్ష దైవం, సర్వాంతర్యామి అయిన శ్రీ వెంకటేశ్వరస్వామి  జగ్గయ్యపేట మండలం, తిరుమలగిరిలో వల్మీకోద్భవమూర్తిగా కొండపైన భక్తులను అనుగ్రహిస్తున్నాడు. కొండమీద ఏకశిలతో కూడిన వల్మీకం (పుట్ట) రూపంలో స్వయంభువుగా వెలసిన క్షేత్రం తిరుమలగిరి. ఇది కృష్ణా నదికి ఈశాన్యంగా మూడు కిలోమీటర్ల దూరంలో వుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఈ ప్రాంత ప్రజల ఇలవేల్పుగా పూజలందుకుంటుంటారు.  ఈ కొండకు నామాల కొండ అని పేరు.  ఈ వల్మీకం లోపల ఆదిశేషుడు శ్రీ స్వామీ వారికి శయ్యగా ఉంటాడని చెబుతారు. ఇక్కడ విశేషమేమంటే స్వామి వారికి అర్చనలు, అభిషేకాలు ప్రతి నిత్యం జరుగుతూనే ఉంటాయి. ప్రతి రోజూ రాత్రి పూట దేవతలు ఇక్కడ స్వామివారిని పూజించుకుంటారట.అందుకు నిదర్శనంగా ఉదయము తలుపులు తీసాక పుట్ట చుట్టూ నీటి చుక్కలు  కనిపిస్తాయట.  చాలా మహిమగల స్వామి అని నమ్ముతారు. తిరుపతి సమీపంలో అలివేలుమంగాపురం ఉన్నట్లు ఇక్కడ కూడా అలివేలుమంగ నివసించిందనడానికి గుర్తుగా  ఈ పర్వతం సమీపంలో మంగొల్లు అనే గ్రామం వుంది. దీని అసలు పేరు మంగప్రోలు... అది క్రమేపి మంగొల్లుగా మారిందని భావిస్తుంటారు.  

ఈ స్వామిని దొరబాబు, నామాల వెంకటేశ్వరస్వామి అనికూడా పిలుచుకుంటారు

           ఇక్కడ శ్రీ స్వామివారు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మాత్రమే పూజలందుకుంటారు. ఆలయ తలుపులు మూసిన తరువాత దేవస్థానంలో గాని, కొండ పరిసర ప్రాంతాలలో గాని ఎవ్వరు వుండరు. ఆ సమయంలో ఆదిశేషుడు స్వామి వారిని అర్చిస్తాడని భక్తుల బలమైన నమ్మకం. ఈ కొండమీద స్వామివారిని సేవిస్తూ మహాకాల సర్పం (ఆదిశేషుడు) తిరుగుతుంటాడని స్వయంగా చూసిన వారు చెపుతుంటారు. అందుకే రాత్రి వేళల్లో దేవతలు, ఆదిశేషు స్వామిని సేవిస్తారని కొండ మీదకు ఎవ్వరు వెళ్ళరు. సాహసించి వెళ్ళిన వారికి పాము బుస భయంకొలుపుతూ వినిపించటం వలన పరుగులు పెడుతూ కిందకు దిగిపొయిన సంఘటనలు ఉన్నాయి. 

ఈ క్షేత్రం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచి ఉంటుంది. 

          కొండ మీద స్వామీ వారికి తూర్పున స్వామీ వారి ఎడమ పాదాకారంలో వున్నకోనేరు కనిపిస్తుంది. అక్కడే శివాలయం, స్వామీ వారి పాదాలు మనకు కనిపిస్తాయి. కొండ చుట్టూ, మధ్య భాగంలో తొమ్మిది ఆంజనేయ స్వామీ వారి విగ్రహాలు వున్నాయి.  ఈ విగ్రహాలను భరద్వాజ మహర్షి ప్రతిష్టించాడని ప్రతీతి. ఇక్కడ వరాహ స్వామి కూడా వున్నారు.  
స్థల పురాణం :
         భరద్వాజముని తపోఫలంగా మానవులను తరింప చేయడానికి శ్రీనివాసుడు వల్మీక రూపంలో ద్వాదశ నామాలతో స్వయంభువుగా వెలిశాడని స్థల పురాణ కధనం. ఈ వల్మీకం మీదనే స్వామి వారి ఉభయ దేవేరులు లక్ష్మి, శ్రీదేవి నామాల రూపంలో కొలువై వున్నారు.
          ఈ క్షేత్రం సమీపంలో భరద్వాజ మహర్షి తపస్సు చేసి వరం పొంది, స్వామీ వారికి నిత్యం పవిత్ర కృష్ణా జలాలతో అభిషేకం చేసేవాడని స్థల పురాణం.  
        శ్రీవేంకటేశ్వరస్వామికి  వల్మీకం(పుట్ట)లో దాహం వేయగా ఈశ్వరుడు గోవుగా,  బ్రహ్మ దూడగా వచ్చి శ్రీ స్వామి వారి దాహం తీర్చినట్లుగా చెబుతారు.
           ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి.  ఈ ఆలయం ఉత్తర భాగంలో వున్న బిల్వ వృక్షానికి మూడు ప్రదక్షిణలు చేసి భార్య చీర చెంగు చింపి ఈ చెట్టుకు కట్టి తన కోరిక తెలుపుకుంటే ఏడాది తిరిగేలోపు పండంటి బిడ్డతో వచ్చి శ్రీ స్వామీ వారిని దర్శించుకుంటారనే విశ్వాసం భక్తులలో వుంది. 
ఉత్సవాలు
               ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ చతుర్దశి నుంచి బహుళ చవితి వరకు బ్రహ్మోత్సవ కార్యక్రామాలు వైభవంగా జరుగుతాయి. అంకురార్పణ కార్యక్రమం నుండి కళ్యాణం, రథోత్సవం, సదస్యం, చక్రతీర్థం, పవళింపు సేవ, అశ్వవాహనోత్సవం వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తుంటారు. ప్రతి నెల పౌర్ణమికి మాస కళ్యాణం, శాంతి కళ్యాణంలు వేదం మంత్రోచ్ఛారణతో జరుగుతుంటాయి. పరిమిత సంఖ్యలో నిత్యాన్నదానం జరుగుతుంది, గదులు వున్నాయి.

                ప్రతి ఉగాదికి గిరి ప్రదక్షిణ జరుగుతుంది. భక్తులు ప్రభలు కట్టుకుని వచ్చి స్వామి వారిని దర్శిస్తారు. రైతులు తమ తమ పాడి గేదెలను  అందంగా అలంకరించుకుని తమ తమ పొలాలలోని తొలి పంటను స్వామీ వారికి సమర్పించి గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇలా చేయడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయని రైతుల నమ్మకం.


             ఈ ప్రాంతానికి చేరుకోవడానికి విజయవాడ నుండి జగ్గయపేట వెళ్లే దారిలో చిల్లకల్లు దగ్గర దిగి అక్కడినుండి ప్రైవేట్ ఆటోలు, ఆర్టీసీ బస్సులు వున్నాయి.

 

Tirumalagiri

శ్రీ భవానీ ముక్తేశ్వరస్వామి వారి దేవస్థానం, ముక్త్యాల

కృష్ణాతీరాన వెలసిన అతి ప్రాచీన పుణ్య క్షేత్రమిది. రెండు శివలింగాలు .. రెండు నందులు.. ఒకే స్వామికి రెండు ఆలయాలు .. పరమ శివుడు స్వయంగా కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట మండలం, ముక్త్యాల గ్రామ ఒడ్డున ‘ముక్తేశ్వరస్వామి’గా వెలసిన సుక్షేత్రమిది.  సంవత్సరంలో ఈ ఆలయం ఆరు నెలలు పాటు మాత్రమే తెరచి వుంటుంది.. మిగతా ఆరు నెలలు నదిలోనే మునిగి వుంటుంది... ఆ సమయంలో ముక్తేశ్వరుని దేవతలు ఆరాధిస్తారని భక్తుల విశ్వాసం.... ఈ ఆలయంలో కనిపించే రెండు శివలింగాల్లో ఒకటి స్వామి వారికి, రెండవది అమ్మవారికి ప్రతీకలుగా భక్తులు విశ్వసిస్తారు. అలాగే విగ్రహానికి ఎదురుగా రెండు నందులు ఉంటాయి.. వీటిలో దక్షిణం వైపున్న నందిని తిరుగుడు నందిగా పిలుస్తారు.. పూర్వ కాలంలో భార్య సుఖప్రసవానికి భర్త ఈ నందిని తిప్పేవాడని అలా చేస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా ప్రసవం అయ్యేదని భక్తుల ప్రగాడ విశ్వాసం.  ఉత్తరవాహినిలో స్నానం చేయడం వలన సకల పాపలు తొలగుతాయాని భక్తులు భావిస్తారు. 

నదిలో వుండే దేవాలయము
శ్రీ  ముక్తేశ్వర స్వామి వారు 

జగ్గయ్యపేటకు పది కిలోమీటర్లు దూరంలో వున్న పరమ పవిత్రమైన శైవ క్షేత్రం. అంతే కాకుండా అన వేమారెడ్డి రాజు కొలువులో వాసి కెక్కిన 'వాసిరెడ్డి' జమీందారుల సంస్థానం.  సంస్థానానికి చింతలపంటు అనే పేరు వుంది... చారిత్రాత్మక కోట గల ప్రాంతం...  కోటి లింగాల ప్రతిష్ట జరిగిన ప్రాంతం... సుమారు 1300 సంవత్సరాల చరిత్ర గలిగిన శివాలయం... ఒకనాడు బౌద్ధ బిక్షువులకు  ఆవాసమైన  ప్రదేశమే ఈ ముక్త్యాల....


అతి పురతనమైన  శ్రీ ముక్తేస్వరస్వామి వారి శివాలయం ద్వారం 

ముక్త్యాల జమీందారులు కవులను విశేషంగా ప్రోత్సహించారు. మాహిష్మతి ముద్రణాలయాన్ని నెలకొల్పి అనేక పుస్తకాలను అచ్చు వేశారు.  ఎందరో కవులు, కళాకారులు తమ విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించి  రాజుల మెప్పు పొందారు. కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ...ముక్తినొసంగుతూ... ముక్తేశ్వరస్వామి కొలువై ఉన్నందువల్ల ముక్తేశ్వరపురం, ముక్త్యాల అనే పేరు వచ్చింది.
స్థల పురాణం :  ఈ క్షేత్రం మూడవ శతాబ్దంలో నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. భరద్వాజ మహర్షి తపస్సు చేసిన ప్రాంతం.. త్రేతాయుగంలో పలువురు బుషులు ఈ తీర్ధంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని నిత్యం ఉత్తరవాహినిలో స్నానమాచరించే వారని పురాణా గాధ. నది తీరంలోని ముక్తేశ్వరస్వామి ఆలయంలో  ఆరు నెలలు దేవతాపూజా, ఆరు నెలలు భక్తులతో పూజలు నిర్వహిస్తుంటారు. దేవతా పూజ అంటే కృష్ణానదికి వరదలు వచ్చిన ఆరు నెలలు ఈ ఆలయం నీట మునిగి ఉంటుంది. ఆ సమయంలో మహాబుషులు, దేవతలు పూజిస్తారని భక్తుల నమ్మకం. నదీగర్భంలోని ఆలయం కాక నదీతీరంలో మరొక భవానీ ముక్తేశ్వరస్వామి ఆలయం కన్పిస్తుంది. 

రెండువేల నాటి” శాలివాహన సప్తశతి “లో ఈ ముక్త్యాల ప్రాంతాన్ని గూర్చిన గాథలున్నట్లు చరిత్ర కారులు చెపుతారు. ముక్తేశ్వర స్వామిని బలి చక్రవర్తి ప్రతిష్టించాడని ప్రతీతి. బాణాసురుని తండ్రి ఐన బలి చక్రవర్తి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన పరమేశ్వరునితో స్వామి.. కృష్ణ నది ఉత్త్తర వాహినిగా ప్రవహిస్తున్న ఈ పరమ పవిత్రమయిన ప్రదేశంలో వున్న మానవాళికి ముక్తిని ప్రసాదించుటకు నీవు ఈ క్షేత్రంలో స్వయంగా వెలసి అందరిని కాపాడుతూ ముక్తిని ప్రసాదించమని కోరగా శివుడు అందులకంగీకరించి ముక్తేశ్వర స్వామిగా ఈ క్షేత్రంలో స్వయంభువుగా కొలువైనాడని పురాణగాధ. క్రీ.శ 12 వశతాబ్దపు నాటి శాసనాలు శ్రీభవానీ ముక్తేశ్వరస్వామి దేవాలయనందు కన్పిస్తున్నాయి. ఇక్కడే చెన్నకేశవ స్వామి వారి ఆలయం ఉండటంతో హరిహరక్షేత్రమైంది. నదీ గర్భం లో బలి చక్ర వర్తి నిర్మించిన స్వర్ణ ఆలయం వుందని చెప్పు కొంటారు .కృష్ణ అవతల  గుంటూరు జిల్లా, పశ్చిమాన తెలంగాణా, ఉత్తరం తూర్పులలో కృష్ణా నది వున్నవి.

శ్రీ భవానీ ముక్తేశ్వరస్వామి వారి ఆలయం 

కార్తీకమాసంలో విశేషపూజ లుంటాయి. ఈ భవానీ ముక్తేశ్వరస్వామి కి మాఘ బహుళ చతుర్ధశి  మహాశివరాత్రి నాడు కళ్యాణోత్సవం జరుగుతుంది. పర్వదినాల్లోను, పుష్కర సమయాల్లోను ఇచ్చట కృష్ణవేణి ఉత్తరవాహిని లో స్నానం చేయడానికి దూరప్రాంత భక్తులు కూడ తరలివస్తారు. 

ముక్త్యాల కోట

కృతయుగంలో బలిచక్రవర్తి కట్టిన దేవాయం కాలగమనంలో నదీగర్భంలోకి వెళ్ళిపోయిందన్నది ఇక్కడి స్థల పురాణ ప్రాశస్త్యం, కాకతీయ, రెడ్డిరాజులు  11వ శతాబ్ధానికి ముందే నదీతీరంలోని ఈ ఆలయాన్ని  భక్తుల కోసం పునరుద్ధరించారని చరిత్ర చెబుతోంది. సంతానం కోసం జంట నందులతో కూడిన ఈ శివాలయంలో అర్చన విశేష ఫలితాన్ని ఇస్తుందన్న విశ్వాసంతోనే వారు ఎక్కడా లేని విధంగా వీటిని ప్రతిష్టించారు. కాలగమనంలో ఈ నందులు కూడా ఛిద్రంకాగా ప్రస్తుత వాసిరెడ్డి వంశీయులే వాటిని పునఃప్రతిష్టించారు.

ముక్త్యాల రాజా 

కోటి లింగాల క్షేత్రం 




MUKTHESWARA SWAMY, MUKTYALA